05/08/2026
క్షణాల్లో నిద్ర పట్టాలంటే..!
ఏంటీ ‘మిలిటరీ మెథడ్’
‘నేను నిద్రకు ఉపక్రమిస్తే, 8 సెకన్లలోనే కునుకు పడుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలతో చెప్పడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే మనుషులకు అంత త్వరగా నిద్రలోకి జారుకోవడం సాధ్యమా అనే చర్చ జరుగుతోంది. అయితే 8 సెకన్లలోనే కాకపోయినా, ‘మిలిటరీ మెథడ్’ (The military method) చిట్కాను పాటిస్తే, రెండు నిమిషాల్లోనే నిద్రపట్టడం ఖాయమట. అమెరికాకు చెందిన ఒకప్పటి ప్రముఖ ట్రాక్ అండ్ స్ప్రింట్ కోచ్ లాయిడ్ బడ్ వింటర్ 1981లో ‘రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్‌షిప్ పెర్ఫార్మన్స్’ పుస్తకంలో ఈ విధానం గురించి వివరించారు. షరోన్ అక్మాన్ అనే బ్లాగ్ రైటర్ ‘హౌ టు ఫాల్ అస్లీప్ ఇన్ 120 సెకండ్స్’(How to Fall Asleep in 120 seconds) అనే వ్యాసంలో ఈ పద్ధతి గురించి ప్రస్తావించడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఏంటీ ‘మిలిటరీ మెథడ్’?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాకు చెందిన సైనిక సిబ్బందికి నిద్రపోవడానికి కూడా తగిన సమయం ఉండేది కాదు. వారు పడుకున్న వెంటనే త్వరగా నిద్రలోకి జారుకుంటేనే, శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించి మరింత ఉత్సాహంగా విధుల్లో పాల్గొనడం సాధ్యమయ్యేది. అందుకోసం లాయిడ్ బడ్ వింటర్ ‘మిలిటరీ మెథడ్’కు రూపకల్పన చేశారు. సైనిక సిబ్బంది రెండు వారాల పాటు దీన్ని సాధన చేసేలా చూశారు. దీనివల్ల 96 శాతం మంది సిబ్బందికి తుపాకుల మోతల మధ్య కూడా 120 సెకన్లలోనే నిద్రపోవడం అలవాటైందట. పేరుకు ఇది 2 నిమిషాల ప్రక్రియ అయినా, కునుకు పట్టేది చివరి 10 సెకన్లలోనే అని లాయిడ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఈ విధానంలో ఏం చేయాలంటే..
మంచంపై పడుకొని మీ ముఖంలోని కండరాలను, అలాగే నోటి లోపలి కండరాలనూ సడలించి పూర్తిగా రిలాక్స్ మోడ్‌లో ఉండాలి.
మీలోని ఒత్తిడి తొలగిపోవడానికి భుజాలను కిందికి వదిలేయాలి. చేతులను మీ శరీరం పక్కన చాచి ఉంచాలి.
నెమ్మదిగా శ్వాసను బయటికి వదులుతూ ఉండండి.
దీనివల్ల ఛాతి భాగంలోని టెన్షన్ తగ్గుతుంది.
కాళ్లు, తొడలను పూర్తిగా రిలాక్స్ చేయండి.
మీ మెదడులోని ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు 10 సెకన్ల పాటు ప్రశాంతమైన దృశ్యాన్ని ఊహించుకోండి. ఉదాహరణకు నిశ్శబ్దమైన సరస్సు, సముద్రతీరం, పచ్చని ప్రకృతి మధ్య మీరు ఉన్నట్లు అనుకోండి.
అలా చేయడం కుదరకపోతే ‘ఎలాంటి ఆలోచనలు వద్దు’ అనే మాటను 10 సెకన్ల పాటు మనసులోనే అనుకోండి. అప్పుడు సుమారు 10 సెకన్లలోనే మీకు నిద్రపడుతుంది.
#ఆయురారోగ్యాలు
🌿