07/05/2026
స్విమ్స్ తిరుపతి
తేది.07.05.26
రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా స్విమ్స్ అభివృద్ధి
టిటిడి ఛైర్మన్ శ్రీ బిఆర్. నాయుడు గారు
రూ.100 కోట్లతో స్విమ్స్ నందు ఆధునీకరణ మరియు వైద్యయంత్రాలు ప్రారంభం
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యములో భాగంగా రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ను అభివృద్ధి చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడుగారు వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో రూ.55 కోట్లతో ఏర్పాటుచేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ లీనియర్ యాక్సిలరేటర్ ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీ బిఆర్. నాయుడుగారు మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. క్యాన్సర్ వైద్య చికిత్సల కోసం శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకం నిధులతో ప్రారంభించిన. పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్ డ్ లీనియర్ యాక్సిలరేటర్ వైద్య పరికరాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో దాదాపు రూ.18కోట్ల విలువైన పెట్ సిటీ స్కాన్ పరికరం క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడుతుందన్నారు. రూ.5 కోట్ల విలువైన గామా కెమెరా అవయవాల పనితీరును, కణజాల స్థితిని చిత్రాల రూపంలో చూపిస్తుందని, క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు, గుండె, మెదడు, థైరాయిడ్, ఎముకలు, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా, రూ.29 కోట్ల విలువైన హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా అధిక శక్తి గల ఎక్స్-రేలు లేదా ఎలక్ట్రాన్ కిరణాలను క్యాన్సర్ ట్యూమర్పై ఖచ్చితంగా ప్రసారం చేస్తుందని, దీని వల్ల చుట్టుపక్కల ఆరోగ్యకర కణజాలానికి హాని తక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ యంత్రం మెదడు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తులు వంటి భాగాల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి శ్రీ . నందమూరి తారక రామారావు రామారావు గారు స్థాపించిన స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. 30 ఏళ్లుగా టిటిడి సహకారంతో రూ.450 కోట్లతో ఆసుపత్రిలో మెరుగైన వైద్యసౌకర్యాలు ఏర్పాటుజరిగిందని వివరించారు. ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్. నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా రూ.600 కోట్లతో పలు భవనాలు నిర్మించుకుంటున్నామని వెల్లడిచారు. ఆరు నెలల క్రితం దాతల సహకారంతో ఎంఆర్ ఐ, సిటి స్టిమ్యులేటర్ యంత్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో క్యాన్సర్ బ్లాకు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా సిమ్యులేటర్స్, వర్చువల్ డిసెక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.105 కోట్ల విరాళాలతో స్విమ్స్ పలు వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. శ్రీ బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి విరివిగా విరాళాలు అందించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తోడ్పాటునందిస్తున్న దాతలకు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు అందిస్తున్న సంస్థలకు స్విమ్స్ కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి. శ్రీ భానుప్రకాష్ రెడ్డి, తుడ ఛైర్మన్ మరియు టిటిడి బోర్డు సభ్యులు శ్రీ సి. దివాకర్రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ ఆర్. సి. మునికృష్ణ, ఇతర నాయకులు స్విమ్స్ అధికారులు మరియు రేడియేషన్ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-స్విమ్స్ సోషల్ మీడియా